రేవంత్ ఇచ్చిన హామీలకు.. ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదు: ఈటల రాజేందర్
- ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఈటల
- బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన
- మమత అహంకారానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. గజ్వేల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడంలో, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చివరికి న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయికి పరిస్థితి దిగజారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు అందక వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ఛీత్కరించుకునే స్థితికి చేరుకుందని ధ్వజమెత్తారు.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అహంకారానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని, తమిళనాడులో స్టాలిన్ వంటి బలమైన నేతపై ఒక సామాన్యుడు గెలిచాడంటే అక్కడి ప్రభుత్వాలపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని విశ్లేషించారు. కుటుంబ రాజకీయాలు చేస్తూ, రాష్ట్రాన్ని తమ జాగీరుగా భావించే వారికి తమిళనాడు ఫలితాలు ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి ఈ ఫలితాలు కనువిప్పు కావాలని... తెలంగాణ బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.